Monday, June 8, 2015

అందరూ దొంగలే..!

       ఇటీవల కాలంలో తెలుగు రాష్ట్రాల్లో ఓటుకు నోటు వ్యవహారం హాట్ టాపిక్ గా మారింది. ఇక్కడ రేవంత్ రెడ్డి నిర్ధోషి అని ఎవరూ సమర్థించలేరు. అదే సమయంలో రేవంత్ రెడ్డిని కుట్రపూరితంగా ట్రాప్ చేశారనడంలో ఎటువంటి సందేహం లేదు. అన్నీ సంస్థలు తన ఆధీనంలో ఉన్నాయి కాబట్టి తెలంగాణ ప్రభుత్వం రాజ్యాంగ సంస్థలను ఉపయోగించి ప్రతిపక్ష ప్రజాప్రతినిధులను ట్రాప్ చేసే యత్నం చేసిందన్న ఆరోపణలు వస్తున్నాయి. ఎమ్మెల్సీ ఎన్నికలకు రెండు రోజుల ముందు టిడిపి ఎమ్మెల్యే మాధవరం క్రుష్ణారావు ఎందుకు టిఆర్ఎస్ లో చేరాల్సి వచ్చింది? రెండు రోజుల తర్వాత ఎన్నికలయ్యాక పార్టీ మారవచ్చు కదా? అన్న అనుమానాలు అందరిలో ఉన్నాయి. కానీ అక్కడ పార్టీ మారింది నియోజకవర్గ అభివ్రుద్ధి కోసం మాత్రమే కాదన్నది అందరికీ తెలిసిన సత్యం. ఇలా అధికార పార్టీ చాలామంది విపక్ష ఎమ్మెల్యేలు వివిధ రకాలుగా ప్రలోభ పెట్టి తమ పార్టీలోకి చేర్చుకుందనే విమర్శలు బహిరంగంగానే వ్యక్తమవుతున్నాయి. అంటే రేవంత్ రెడ్డి దొరికిన దొంగ మాత్రమే. అయితే ఆయనను అరెస్టు చేసిన తరువాత జరుగుతున్న పరిణామాలు చూస్తుంటే అధికార పార్టీకి పలు అధికార యంత్రాంగాలు ఎలా సహకరిస్తున్నాయనేది తెలిసిపోతుంది. ముందుగా టేపులు మూడు మీడియా సంస్థలకు మాత్రమే లీకు అయ్యాయి. అది కూడా మేము విడుదల చేయలేదంటూ స్వయంగా ఏసీబీ డిజి ఏకే ఖాన్ స్పష్టంగా చెప్పారు. అంటే ఎక్కడి నుంచి ఆ మూడు ఛానళ్లకు ఆడియో, వీడియో టేపులు లభించాయి? 
          సాధారణంగా ఇక్కడ మరో ప్రశ్న కూడా రాజకీయ వర్గాల్లో తలెత్తుతుంది. నిజంగా స్టిఫెన్ సన్ కు తన ఓటుకు అమ్ముకోవడం ఇష్టంలేకపోతే డైరెక్టుగా చెప్పవచ్చు కదా? ఇంత ప్రణాళికతో, అత్యాధునిక కెమెరాలతో నమ్మివచ్చిన రేవంత్ రెడ్డిని పట్టించాల్సిన అవసరం ఏంటి?.. ఇలా చాలా ప్రశ్నలు చాలామందిలో మెదలుతున్నాయి. కానీ అక్కడ స్టిఫెన్ సన్ వెనకాల పెద్ద శక్తులు ఉన్నాయన్నది అందరిలో బలంగా వినిపిస్తున్న వాదన. దీనికి బలం చేకూరుస్తూ  అరెస్ట్ కావడానికి రెండు గంటల ముందు టిఆర్ఎస్ కార్యాలయంలో జరిగిన సమావేశంలో సీఎం కెసిఆర్ స్వయంగా మరో గంటలో మీరో పెద్ద బ్రేకింగ్ వింటారని ఎమ్మెల్యేలతో అన్నట్లు వార్తలు వచ్చాయి.
        ఇక ఈ ఉదంతంలో కీలక మలుపుగా చెప్పుకుంటున్న అంశం చంద్రబాబు, స్టిఫెన్ సన్ ఆడియో టేపుల వ్యవహారం. అడ్గంగా బుక్కయ్యారంటూ చెప్పుకుంటున్న దీంట్లో ఒక్క అంశం కూడా లీగల్ గా కేసు నమోదు చేసేందుకు అవకాశమివ్వడంలేదు. అసలు వాయిస్ చంద్రబాబుది కాదు అని పచ్చపార్టీ నేతలు కొంతమంది చెబుతున్నా.. కొద్దిసేపు ఆయనదే అనుకుందాం. ‘‘మీరు స్వేచ్ఛగా నిర్ణయం తీసుకొండి. మీ వెనకాల మేమున్నాం’’ అన్న ముక్తాయింపు చివరలో ఉంది. అంటే తమకు తప్పకుండా సహకరించాలని ఆయన కోరలేదు కదా.. అని టిడిపి వర్గాలు చెబుతున్నాయి. ఏదేమైనా ఒక సీఎం స్థాయి వ్యక్తి సంభాషణను ట్యాప్ చేయడం సంచలనం కలిగిస్తోంది. ఈ పరిణామాలు ఎంతవరకు దారితీస్తాయో వేచి చూడాలి. 
        ఇక చివరలో మీడియా పాత్ర కూడా చర్చనీయాంశం అవుతోంది. తెలంగాణ గుండె చప్పుడుగా చెప్పుకునే ఓ ఛానల్ చంద్రబాబు ఆడియో లీక్ అనంతరం  చేస్తున్న వాదనల్లో తీవ్రమైన తప్పు దొర్లుతుంది. కానీ తాము చెప్పేదే నిజం అన్నట్లుగా అదే వాదనను కొనసాగిస్తుంది. ఆడియో టేపులు రికార్డు, విడుదలపై ఆ ఛానల్ చెసే వాదనలు ఆశ్చర్యం కలిగిస్తున్నాయి. రేవంత్ రెడ్డి ని అరెస్టు చేసిన తరువాత ఏసీబీ అరెస్టుకు కొన్ని రోజుల ముందు రేవంత్ ఫోన్ డేటాను సేకరించిందని, అందులో భాగంగా ఈ సంబాషణ వెలుగులోకి వచ్చిందని ఆ ఛానల్ కథనం. నిజంగా ఇది చాలా అసత్య వాదన. ఎందుకంటే కేవలం ట్యాపింగ్ లో ఉన్నప్పుడు మాత్రమే సంభాషణను రికార్డు చేయవచ్చు.. లేదా మన ఫోన్ లో ఆటో రికార్టింగ్ ద్వారా అయినా చేయవచ్చు. అది కూడా సంభాషణ సమయంలోనే. కానీ ఒకసారి సంభాషణ ముగిశాక మళ్లీ దానిని సేకరించడం కుదరదు. అయితే ఫలానా నెంబర్ నుంచి ఏయే నంబర్లకు, ఏయే సమయంలో కాల్స్ వెళ్ళాయి.. ఎంతసేపు సంభాషణ కొనసాగింది అన్న అంశాలు మాత్రమే డేటా సేకరణలో లభిస్తాయి. ఇది టెక్నికల్ అంశం తెలియకుండా సదరు ఛానల్ ఇష్టం వచ్చినట్లుగా కథనం ప్రసారం చేసింది. ఒక ఆడియో టేపులు తమ ఛానల్ కే ఎలా వచ్చాయో చెప్పాల్సిన అవసరం లేదంటూ పదే పదే ఆ ఛానల్ చెప్పుకొచ్చింది. అవును అది నిజమే. మీడియాలో చాలావరకు ప్రసారాలకు స్పష్టమైన ఆధారాలుండవు. సోర్సు ను కూడా బయటికి చెప్పరు. మరి అదే మాట.. ఏబీఎన్ ఛానల్ గతంలో ప్రసారం చేసిన.. హలో అంకుల్.. ఎపిసోడ్ కు, ఇతర అంశాలకు కూడా వర్తిస్తుంది కదా. ఇక సీఎం చంద్రబాబు ఫోన్ ట్యాప్ చేయడం ద్వారా మొత్తం ఆంధ్రప్రదేశ్ ప్రజలను అవమానించారని టిడిపి చేస్తున్న వాదనను సదరు పదే పదే ఖండించింది. ఇది కేవలం చంద్రబాబు, టిడిపి వ్యక్తిగత అంశంగా చెబుతుంది. మరి గతంలో, ఇప్పుడుకూడా కెసిఆర్ ను విమర్శిస్తోనో,, టిఆర్ఎస్ పార్టీని విమర్శిస్తోనో.. మొత్తం తెలంగాణ సమాజానికి అన్వయించింది ఆ ఛానల్. తెలంగాణ ప్రజలను  అవమానపర్చారంటూ పెద్ద రాద్దాంతం చేసింది. మరి ఇప్పుడేమో అలా అనుకోవద్దంట. 
           రాజకీయ పార్టీలైనా, మీడియా ఛానళ్లైనా ద్వంద్వ రీతులు పాటించడమన్నది నేటి కాలంలో సర్వసాధారణమైపోయింది. ఇతరులైతే ఒక వాదన ఎత్తుకుంటారు. తమ వరకు వచ్చే సరికి మరో వాదన ఎత్తుకుంటారు. ప్రజలే  చైతన్యవంతులై నిజనిజాలను గుర్తించాలి.

Saturday, May 16, 2015

ఒకే దెబ్బకు రెండు పిట్టలు..

     
     ‘తెలంగాణాలో ఎనిమిది రోజుల పాటు జరిగిన ఆర్టీసీ కార్మికుల సమ్మె విజయవంతంగా ముగిసింది. కార్మికుల అకుంఠిత పోరాటానికి ఎట్టకేలకు ప్రభుత్వం దిగిరాకతప్పలేదు’.. ఇది చాలామంది కార్మికసంఘాల నాయకులు, ప్రజల్లో ఉన్న అభిప్రాయం. కానీ చాలా కొద్దిమందికే అసలు వాస్తవం గమనంలో ఉంది. ఒకే దెబ్బకు రెండు పిట్లలను సిఎం కెసిఆర్ కొట్టారు. రాజకీయ ఎత్తుగడల్లో దిట్టఅయిన ఆ మేధావి కార్మికులను పావులుగా వాడుకొని ప్రజలపై భారం వేయడానికి సిద్ధంగా ఉన్నారు. ఆర్టీసీ ఛార్జీలు పెంచేందుకే ప్రభుత్వం తమ పార్టీకే అనుబంధమైన, క్యాబినెట్ మంత్రి గౌరవాధ్యక్షుడిగా ఉన్న యూనియన్ చేత సమ్మె చేయించిందని చాలామంది అనుకుంటున్నారు. ఇది ముమ్మాటికి నిజం. ప్రజలపై ఛార్జీల మోత వేయడానికి సమ్మె ఓ కుంటిసాకు కానుంది. ఇది ఒక పిట్ట మాత్రమే. మరో పిట్ట గురించి పెద్దగా ఎవరు పట్టించుకోవడం లేదు. అది యూనియన్ ఎన్నికలు. ఈ దఫా యూనియన్ ఎన్నికల్లోనూ టిఎంయూనూ.. అందునా ఒంటరిగా గెలిపించేందుకు ప్రభుత్వ పెద్దలు కలిసి ఆడిన నాటకం సమ్మె అని కార్మికసంఘాల నేతలే బహిరంగంగ వ్యాఖ్యానిస్తున్నారు. ప్రస్తుతం టిఎంయూ, ఈయూ సంయుక్తంగా గుర్తింపు యూనియన్ హోదా కలిగి ఉన్నాయి. ఆర్టీసీ యాజమాన్య బోర్డులో టిఎంయూ నేత అశ్వద్ధామరెడ్డితో పాటు ఈయూ నేత పద్మాకర్ డైరెక్టర్లుగా ఉన్నారు. 
     ఆర్టీసీ కార్మికులు సమ్మెకు దిగడానికి ముందునుంచి వినిపిస్తున్న ప్రధాన డిమాండ్ 43 శాతం ఫిట్ మెంట్. సమ్మె ప్రారంభం అయిన రెండు రోజులకు 27 శాతం ఫిట్ మెంట్ ఇవ్వడానికి సమ్మతి తెలిపిన ప్రభుత్వం పెద్దలు.. కార్మికులు అడిగినంతగా ఇవ్వడానికి ఆస్తులు అమ్ముకోవాలంటూ కారడ్డంగా మాట్లాడారు. కానీ అదే పెద్దలు.. ఆ మాట చెప్పిన వారం లోపే 44 శాతం (కార్మికులు అడిగిన దానికంటే ఒకటి ఎక్కువ) ఫిట్ మెంట్ ఇచ్చేందుకు అంగీకరించారు. ఈ వారం రోజుల్లో ప్రభుత్వంలో వచ్చిన మార్పు దేనిగురించన్నదే ఇప్పడు సర్వత్రా వ్యక్తమవుతున్న సందేహం. ఒకవేళ కార్మికులు అడిగారు కాబట్టి, ప్రజలు ఇబ్బంది పడుతున్నారు కాబట్టి.. తప్పలేదు అని ప్రభుత్వ పెద్దలు బొంకినా అది కరెక్టు కాదు. ఎందుకంటే కార్మికులు అడిగింది 43 శాతమే. 40 అయినా వాళ్లు అంగీకరించేవాళ్లు. కానీ వాళ్లు అడిగినదానికంటే ఎక్కువ ఎందుకు పెంచాల్సి వచ్చింది? ఎందుకంటే పక్క ప్రభుత్వం కంటే తాము గొప్ప అని చెప్పుకునేందుకు చేసిన ప్రయత్నం తప్ప మరోకటి కాదు. కెసిఆర్ ప్రతి నిర్ణయం వెనక చంద్రబాబు పాత్ర ఉందని పచ్చపార్టీ నేతలు మొదటినుంచి వాదిస్తున్నారు. ప్రతిధి చంద్రబాబు ను చూసే కెసిఆర్ చేస్తున్నారని ఈ నిర్ణయంతో చాలా స్పష్టంగా ప్రజలకు కూడా తెలిసిపోయింది. దీన్ని బట్టి తెలంగాణ ప్రభుత్వాన్ని పేరుకు కెసిఆర్ నడిపిస్తున్నా.. కెసిఆర్ ను నిర్దేశిస్తున్నది మాత్రం చంద్రబాబేనన్న మాట. ఇది అందరిలో వ్యక్తమవుతున్న సందేహం. దీనికి సమాధానం చెప్పాల్సింది గులాబీ నేతలే.  బహుశా పరిపాలనా అనుభవం లేక కెసిఆర్ గారు చంద్రబాబును ఫాలో అవుతున్నారేమో?