Saturday, May 16, 2015

ఒకే దెబ్బకు రెండు పిట్టలు..

     
     ‘తెలంగాణాలో ఎనిమిది రోజుల పాటు జరిగిన ఆర్టీసీ కార్మికుల సమ్మె విజయవంతంగా ముగిసింది. కార్మికుల అకుంఠిత పోరాటానికి ఎట్టకేలకు ప్రభుత్వం దిగిరాకతప్పలేదు’.. ఇది చాలామంది కార్మికసంఘాల నాయకులు, ప్రజల్లో ఉన్న అభిప్రాయం. కానీ చాలా కొద్దిమందికే అసలు వాస్తవం గమనంలో ఉంది. ఒకే దెబ్బకు రెండు పిట్లలను సిఎం కెసిఆర్ కొట్టారు. రాజకీయ ఎత్తుగడల్లో దిట్టఅయిన ఆ మేధావి కార్మికులను పావులుగా వాడుకొని ప్రజలపై భారం వేయడానికి సిద్ధంగా ఉన్నారు. ఆర్టీసీ ఛార్జీలు పెంచేందుకే ప్రభుత్వం తమ పార్టీకే అనుబంధమైన, క్యాబినెట్ మంత్రి గౌరవాధ్యక్షుడిగా ఉన్న యూనియన్ చేత సమ్మె చేయించిందని చాలామంది అనుకుంటున్నారు. ఇది ముమ్మాటికి నిజం. ప్రజలపై ఛార్జీల మోత వేయడానికి సమ్మె ఓ కుంటిసాకు కానుంది. ఇది ఒక పిట్ట మాత్రమే. మరో పిట్ట గురించి పెద్దగా ఎవరు పట్టించుకోవడం లేదు. అది యూనియన్ ఎన్నికలు. ఈ దఫా యూనియన్ ఎన్నికల్లోనూ టిఎంయూనూ.. అందునా ఒంటరిగా గెలిపించేందుకు ప్రభుత్వ పెద్దలు కలిసి ఆడిన నాటకం సమ్మె అని కార్మికసంఘాల నేతలే బహిరంగంగ వ్యాఖ్యానిస్తున్నారు. ప్రస్తుతం టిఎంయూ, ఈయూ సంయుక్తంగా గుర్తింపు యూనియన్ హోదా కలిగి ఉన్నాయి. ఆర్టీసీ యాజమాన్య బోర్డులో టిఎంయూ నేత అశ్వద్ధామరెడ్డితో పాటు ఈయూ నేత పద్మాకర్ డైరెక్టర్లుగా ఉన్నారు. 
     ఆర్టీసీ కార్మికులు సమ్మెకు దిగడానికి ముందునుంచి వినిపిస్తున్న ప్రధాన డిమాండ్ 43 శాతం ఫిట్ మెంట్. సమ్మె ప్రారంభం అయిన రెండు రోజులకు 27 శాతం ఫిట్ మెంట్ ఇవ్వడానికి సమ్మతి తెలిపిన ప్రభుత్వం పెద్దలు.. కార్మికులు అడిగినంతగా ఇవ్వడానికి ఆస్తులు అమ్ముకోవాలంటూ కారడ్డంగా మాట్లాడారు. కానీ అదే పెద్దలు.. ఆ మాట చెప్పిన వారం లోపే 44 శాతం (కార్మికులు అడిగిన దానికంటే ఒకటి ఎక్కువ) ఫిట్ మెంట్ ఇచ్చేందుకు అంగీకరించారు. ఈ వారం రోజుల్లో ప్రభుత్వంలో వచ్చిన మార్పు దేనిగురించన్నదే ఇప్పడు సర్వత్రా వ్యక్తమవుతున్న సందేహం. ఒకవేళ కార్మికులు అడిగారు కాబట్టి, ప్రజలు ఇబ్బంది పడుతున్నారు కాబట్టి.. తప్పలేదు అని ప్రభుత్వ పెద్దలు బొంకినా అది కరెక్టు కాదు. ఎందుకంటే కార్మికులు అడిగింది 43 శాతమే. 40 అయినా వాళ్లు అంగీకరించేవాళ్లు. కానీ వాళ్లు అడిగినదానికంటే ఎక్కువ ఎందుకు పెంచాల్సి వచ్చింది? ఎందుకంటే పక్క ప్రభుత్వం కంటే తాము గొప్ప అని చెప్పుకునేందుకు చేసిన ప్రయత్నం తప్ప మరోకటి కాదు. కెసిఆర్ ప్రతి నిర్ణయం వెనక చంద్రబాబు పాత్ర ఉందని పచ్చపార్టీ నేతలు మొదటినుంచి వాదిస్తున్నారు. ప్రతిధి చంద్రబాబు ను చూసే కెసిఆర్ చేస్తున్నారని ఈ నిర్ణయంతో చాలా స్పష్టంగా ప్రజలకు కూడా తెలిసిపోయింది. దీన్ని బట్టి తెలంగాణ ప్రభుత్వాన్ని పేరుకు కెసిఆర్ నడిపిస్తున్నా.. కెసిఆర్ ను నిర్దేశిస్తున్నది మాత్రం చంద్రబాబేనన్న మాట. ఇది అందరిలో వ్యక్తమవుతున్న సందేహం. దీనికి సమాధానం చెప్పాల్సింది గులాబీ నేతలే.  బహుశా పరిపాలనా అనుభవం లేక కెసిఆర్ గారు చంద్రబాబును ఫాలో అవుతున్నారేమో?

No comments:

Post a Comment